23, జూన్ 2014, సోమవారం

 

 జాజుల జావళి

అందరూ మల్లెలంటే మనసు పారేసుకుంటారు గాని సన్నజాజులని ఒకసారి కళ్ళలో నింపుకుంటే ,ఆ సౌరభాన్ని ఆస్వాదిస్తే జన్మలో మరువలేరు.వేసవి కాలంలో మా పెద్దమ్మ వాళ్ళింట్లో ఆరుబయట పడుకొని డాబా మీదకి పాకిన సన్నజాజి తీగ ఆకుల మధ్య నుంచి నిండు చందమామని చూడటం ఎప్పటికీ  వసి వాడని పసితనపు జ్ఞాపకం ....ఏ మాటలికీ  అందనిది, ఏ అక్షరాల్లోనూ ఒదగనిది ....అయినా ఏదో పిచ్చి ఆరాటం  ,ఆ చిన్ననాటి అనుభూతిని అక్షరాల్లో చూసుకోవాలని  ....




 నిండు జాబిలి మనసు పారేసుకుంది
అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజులను చూసి
నీలాల ఆకాశంలో నిలువలేక
ప్రేమలేఖలను పంపుతుంది వెన్నెల దారాలతో
చల్లగాలిపై తేలివచ్చే సన్నజాజుల సువాసన
వెన్నెలకి పరిమళాలు అద్దుతుంది
చిరుగాలికి ఊగుతున్న సన్నజాజి తీగలు
విరహ వేదన పడుతున్న చందమామని ఊయలలూపుతున్న భావన కలిగింది
కలలు చెదిరి కలత నిదురయిన నా రాతిరి కరిగిపోయింది
ఈ  జాబిలి జతలో  ,జాజుల జావళిలో................


పనిలో పని జాజులతో పోటీ పడేలా జానకమ్మ , బాలుగారి  స్వరంలో పలికిన ఈ రాగ సుగంధాలను ఆఘ్రాణిద్దాం ఇక్కడ

నేను చందమామని చూసిన సన్నజాజి తీగ కాదు కానీ ఇది కూదా మా పెద్దమ్మ వాళ్ళింట్లోదే


22, జూన్ 2014, ఆదివారం


 తొలకరి జల్లు

పదాల పూలజల్లులో తడిసి పరిమళాన్ని ఆస్వాదిస్తున్న దారాన్ని నేను
పూలవానలో  నేను మరింత తడవాలని ఈ కొత్త నేస్తానికి స్వాగతం చెప్తున్నాను.

చదవడంలోని ఆనందాన్ని,అక్షరాల్లోని మాధుర్యాన్ని నాకు మరింత దగ్గర చేసిన వేణుశ్రీకాంత్ గారికి,తృష్ణ గారికి , ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు వచ్చేలా నవ్వించే రాజ్ గారికి నా కొత్త బ్లాగ్ ద్వారా ధన్యవాదాలతో నా మొదటి పోస్ట్ ...............